Thursday, July 5, 2018

స్థాన మహిమ
-------------

గరుడా ! సౌఖ్యమా ?
అని రెండు మాటలే కానీ చాలా లోతయిన అర్థం.
స్థాన మహిమకు గొప్ప ఉదాహరణ .
గరుత్మంతుడికి ఆహారం పాములు . పాముకు ఎలుక , ఎలుకకు మరొకటి , ఆ మరొకటికి ఇంకొకటి . ఇలా జీవుల ఆహారం గొలుసు విచిత్రంగా ఉంటుంది . జీవావరణంలో సమతుల్యానికి ఇదో కారణం .  గరుత్మంతుడి వేగం , సునిశితమయిన దృష్టి గురించి పురాణాలనిండా ఉండనే ఉంది . అలాంటి గరుడుడు ఒక రోజు ఉదయాన్నే ఆహారానికి బయలుదేరాడు . మామూలు గద్దలే అన్ని పక్షులకంటే పైన రెక్క కదలకుండా తిరుగుతూ ఉంటాయి . అదో విన్యాసం . అలాంటిది రోజూ విష్ణు మూర్తిని వీపున మోస్తూ 14 లోకాలూ ప్రదక్షిణాలు వేసే గరుడుడు ఎంత ఎత్తులో తిరగాలి ? అలా పైపైకి వెళ్లేసరికి పాము , పామువాసన ఎదురయ్యాయి . ఇంకేముంది కాలివేళ్ళతో పామును తన్నుకు పోవాలి . ఆ పాము కూడా గరుడుడిని చూసి ఏ బొరియలోకో దూరిపోవాలి . కానీ అలా జరగకపోగా - పామే గరుడుడిని ధీమా కుశలమడుగుతోంది .
గరుడా ! సౌఖ్యమా ? (ఏమి గరుడా ! బాగున్నావా ?) అని . ఈలోపు గరుడుడికి ముచ్చెమటలు పట్టాయి . పొరపాటున ఇటొచ్చాను . దయచేసి నన్నొదిలిపెట్టు . నన్ను చూడలేదనుకో అని నమస్కారం పెట్టి వెనక్కు తిరిగి వేగంగా వచ్చేశాడు . పాము నవ్వుకుంది . ఎందుకంటే అది శివుడి మెడలో ఉంది .
అదీ స్థాన మహిమ .

No comments:

Post a Comment